మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్ : కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గనుక అక్కడి సర్కార్ ఎత్తు పెంచినట్లయితే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పటికీ సోయి లేకుండా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకు వెళ్లి ఏం చేశాడని ప్రశ్నించారు. ఖర్గేను పరామర్శించినా ఎందుకని అక్కడి సర్కార్ తో ఎత్తు పెంపుపై ప్రశ్నించ లేదని నిలదీశారు హరీశ్ రావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 112 టీఎంసీలు కర్ణాటక, 74 టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంటి అని అన్నారు.
మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడని, మరి ఆ నల్లమలను అనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా అనేది ప్రజలకు అనవసరం అన్నారు. పులి అయితే మాట్లాడేవాడివి కానీ పిల్లివి కాబట్టే జారుకున్నావని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరంని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించినప్పుడు కుడి కాలువ కెపాసిటీ 11,500 క్యూసెక్కులు మాత్రమేనని అన్నారు హరీశ్ రావు.
ఇప్పుడు కుడి కాలువ కెపాసిటీని 23,000 క్యూసెక్కులు అని అంతకంత పెంచుకుంటూ పోయారని ఆరోపించారు.
463 టీఎంసీలు నీళ్లు గోదావరి నుండి కృష్ణకి ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుందని మండిపడ్డారు. . ఆల్మట్టిలో 112 టీఎంసీలు ఆపుకుంటామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. దీని వల్ల తెలంగాణ నష్ట పోతుందన్నారు హరీశ్ రావు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణ నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం కావాలంటూ భగ్గుమన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ అప్రైజల్ ప్రొసెస్ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశాడని దీనిపై నోరు విప్పడం లేదన్నారు.






