పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశం
అమరావతి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. సచివాలయంలో ఆయన సమీక్ష చేపట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి. అయితే పెరుగుతున్న పరిశ్రమలతోపాటు ప్రజల్లో ఆందోళనలు, సందేహాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా తీర ప్రాంతాల వెంబడి ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే రసాయిన వ్యర్ధాలు తమ జీవనోపాధిని దెబ్బ తీస్తుందన్న ఆందోళనలు మత్స్యకారుల్లో ఉన్నాయని అన్నారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల ఆందోళనకు చేయడానికి అదే ప్రధాన కారణమని గుర్తించాలన్నారు.
రసాయన వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలిపేయడం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని తాను నిర్వహించిన మాట మంతీ కార్యక్రమలో ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. మత్స్యకారుల్లో సందేహాలు నెలకొన్న క్రమంలో వారి సూచనల మేరకు తక్షణం ఆయా పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఆ పరిశ్రమలు ఏ మేరకు కాలుష్యాన్ని సముద్రంలో కలుపుతున్నాయి, జల వాయు కాలుష్యం ఎంత అనే అంశాలపై అధ్యయనం చేపట్టి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు . పరిశ్రమలు సముద్రంలోకి విడుదల చేసే వ్యర్థ జలాలపై పర్యవేక్షణ విషయంలో పారదర్శకతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. పర్యవేక్షణ బృందాల్లో విద్యావంతులైన స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలన్నారు.
మత్స్యకారుల సమస్యల పరిష్కారం, కాలుష్య నియంత్ర తదితర అంశాలపై 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలి. అందులో భాగంగా కాలుష్య కారక పరిశ్రమల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కాలుష్య నియంత్రణ పద్దతులలో, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆధునీకరించి, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంపై పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని అన్నారు. ఇందుకు సంబంధించి పీసీబీ, ఇతర స్టేక్ హోల్డర్స్ తో కలసి 100 రోజుల్లో పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాల”ని సూచించారు.






