స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన బూత్ ఇంఛార్జ్ ల పరిశీలనలో యూసుఫ్ గూడలోని ఓ అపార్టమెంట్ లో ఏకంగా 40కి పైగా ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. అంతే కాకుండా
కృష్ణానగర్ ఎ , బి బ్లాక్‌లలో మాత్రమే కాకుండా యూసుఫ్‌గూడ బస్తీ, యాదగిరి నగర్, జవహర్ నగర్ , వెంగళ్‌రావు నగర్‌లలో కూడా విస్తృతంగా నకిలీ ఓటర్ల నమోదైనట్లు తేలిందని, మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు కేటీఆర్.
బహుళ అంతస్తుల భవనాలలో బహుళ కుటుంబాలు నివసించే ఈ జనసాంద్రత కలిగిన బస్తీలలో, అనుమానం రాకుండా ఉండటానికి పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్లను చేర్చారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల పర్యవేక్షణలో ఇది జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి. విచిత్రం ఏమిటంటే మంగళరపు ప్రాంతంలోని రౌడీ షీటర్ అర్జున్ యాదవ్ కుటుంబం చిరునామాలో 49 ఓట్లు నమోదైనట్లు తేలిందన్నారు. G+3, ఇంటి నం. 8-3-231/B/118 భవనం సంవత్సరాలుగా హాస్టల్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన అర్జున్ యాదవ్ సోదరుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడని తెలిపారు.
ఓటరు జాబితా ప్రకారం ఈ చిరునామాలో 46 ఓట్లు (సీరియల్ నంబర్లు 732–777) ఉండగా మరో మూడు అదనపు ఓట్లు (871–873) లింక్ చేయబడ్డాయని ఆరోపించారు. ఇందులో 40 కంటే ఎక్కువ ఓట్లు జూబ్లీహిల్స్ కు చెందినవి కావన్నారు.






