మహమ్మద్ అజారుద్దీన్ ను బకరా చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్ : అంతులేని హామీలు ఇచ్చి, అర చేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చుక్కలు చూపిస్తోందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మైనార్టీ సామాజిక వర్గానికి ఒక్క సీటు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. మోసపోయిన మైనార్టీలు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. దళిత బంధు, అభయహస్తం పేరుతో మోసం చేసినందుకు దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు కేటీఆర్.
గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్దికి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక అని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు ఉన్న నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ సీటు కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదని చెప్పారు. మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ఆరంభం కానుందని అన్నారు కేటీఆర్. అన్ని వర్గాల మద్దతుతో, అండతో తమ పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బాధ పడుతున్న కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలని కోరారు.






