పునరుద్దరణ పనుల పురోగతిపై రంగనాథ్ ఆరా
హైదరాబాద్ : అమీర్ పేటలో ఆకస్మికంగా తనిఖీ చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నాలాలను ఆయన పరిశీలించారు. పూడుకు పోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలా వరకు వరద సమస్యకు పరిష్కారం చూపగలమని చెప్పారు. అమీర్‌పేట్‌లోని మైత్రివనం జంక్షన్, గాయత్రీ నగర్ ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొత్తం 6 పైపులైన్లు ఉండగా 3 లైన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధణ పనులు పూర్తి చేసినట్టు అధికారులు కమిషనర్‌కు తెలిపారు. మరో 3 లైన్లలో పూడిక తీయడంతో పాటు.. ఈ వరదంతా గాయత్రీ నగర్‌పై పడకుండా అక్కడ కూడా పైపులైన్లలో మట్టిని తొలగించే పనిని పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. వచ్చే వర్షాకాలానికి నీరు నిలవకుండా గాయత్రీ నగర్ కు ముంపు సమస్య లేకుండా చూడాలన్నారు.
అమీర్‌పేట జంక్షన్‌లో సారథీ స్టూడియోస్, మధురానగర్ వైపు నుంచి వచ్చే పైపులైన్లు కలుస్తాయి. ఎగువ నుంచి వరదతో పాటు భారీ మొత్తంలో చెత్త కూడా ఇక్కడకు చేరుతోంది. దశాబ్దాలుగా చేరిన చెత్తతో అమీర్‌పేట జంక్షన్‌లో 6 పైపులైన్లు పూడుకుపోయి, కొంత మొత్తంలోనే వరద నీరు ముందుకు సాగేది. ఏమాత్రం వర్షం పడినా వరద ముంచెత్తేది. శ్రీనివాస్‌నగర్ వెస్ట్ సైడ్ వరద కాలువ పైన కాంక్రీట్‌తో వేసిన పైకప్పు తెరచి పూడిక తీత పనులను హైడ్రా చేపట్టింది. పరుపులు, దిండులు ఇలా చెత్తతో మూసుకు పోయిన పైపులైన్లను తెరచింది. ఇప్పటి వరకూ ఇలా 45 ట్రక్కుల మట్టిని తొలగించింది. దీంతో ఈ ఏడాది 10 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది కలగలేదు. మరో 3 పైపు లైన్లలో కూడా పూడికను తొలగిస్తే 15 సెంటీమీటర్ల వర్షం పడినా అమీర్‌పేటలో వరద ముంచెత్తదని హైడ్రా, జీహెచ్ ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులు కమిషనర్‌కు తెలిపారు. ఇదే మాదిరి నగరంలోని ముంపు సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కల్వర్టులు, అండర్‌గ్రౌండ్ పైపు లైన్లలో పూడికను తొలగించి ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని కమిషనర్ ఆదేశించారు.






