కర్నూల్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం
కర్నూలు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. ఆయన లేక పోతే దేశం ఇలా ఉండేది కాదన్నారు. ఆయన వల్లనే ఇవాళ ప్రపంచం తమ వైపు చూస్తోందని చెప్పారు. ముందుచూపు కలిగిన అరుదైన నాయకుడు మన మోదీ అంటూ కితాబు ఇచ్చారు. కర్నూల్ లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ సభలో పాల్గొని ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఒక దేశపు జెండా ఎలా పౌరుషంగా ఉంటుందో అలాగే మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ ఈ రోజున మన రాష్ట్రానికి విచ్చేసి రూ. 13 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఒక్క ఓర్వకల్లు పారిశ్రామికవాడ లోనే రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడులు రావాలి అంటే ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసి ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం అన్నారు. మోదీ గారి మార్గ దర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారని, ప్రశంసించడం సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, అవకాశాలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయని తెలిపారు.






