ఓకే చెప్పిన కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం
అమరావతి : జల జీవన్ పథకాన్ని పొడిగించింది కేంద్రం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మరో నాలుగు సంవత్సరాల పాటు నిధులను ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల పనులను పథకం విస్తరణలో ప్రారంభించింది ఇప్పటికే. దానికి అనుగుణంగా పనులను చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి తీరుతుంది. రానున్న 30 ఏళ్ల కాలానికి, కోటీ 21 లక్షల 71 వేల మందికి రక్షిత మంచినీటి ఇవ్వాలన్న సంకల్పం నెరవేరుతుంది.
జల్ జీవన్ మిషన్ పథకం కింద గత జులై 4వ తేదీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగు నీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా 1,290 కోట్లతో మెగా ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా పరిధిలో ఇంత పెద్ద తాగునీటి ప్రాజెక్టు ప్రారంభంచడం ఇదే ప్రథమం. దీంతో పాటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తాగు నీటి సరఫరా మెగా ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం.
ప్రతి ఇంటికి సురక్షితమైన జలాలు చేరేలా గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని సంసిద్దం చేస్తున్నారు. మొట్ట మొదటిసారి సిబ్బంది అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నీటి భద్రత, సుస్థిర నిర్వహణ, నీటి నాణ్యత పెంపు, నియంత్రణ, వ్యర్ద జలాల పునర్వినియోగం, క్షేత్ర స్థాయి పరిశీలన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఎస్.ఈ, ఈఈ స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయిలో డిప్యూటీ ఎంపీడీవోలు, ఏఈ స్థాయి వరకు సుమారు 1,400 మందికి శిక్షణ పూర్తి చేశారు. గ్రామ స్థాయి సిబ్బందికి నవంబర్, డిసెంబర్ నెలల్లో శిక్షణ ఇవ్వనున్నారు.






