ప్రశంసలు కురిపించిన సీఎం చంద్రబాబు
అమరావతి : శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అప్పుడే సంక్షేమం అందరికీ అందుతుందని అన్నారు. ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. అప్పుడే కుటుంబంలో, సమాజంలో సుఖ శాంతులు ఉంటాయి. ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడి ఉంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటానని స్పష్టం చేశారు సీఎం. తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయనే నమ్మకంతో పరిశ్రమలు, కంపెనీలు వస్తాయని అన్నారు. అదే నమ్మకంతో విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. విశాఖలో గూగుల్ పెడుతున్న పెట్టుబడులు దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు. 15 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా హబ్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
పెట్టుబడులు వచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు చంద్రబాబు నాయుడు. అప్పుడే ఏపీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు. ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజంను అణిచి వేయడంలో పోలీసులు ఎంతో పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. సిద్దాంతం పేరుతో, ఆధిపత్యం కోసం, డబ్బుల కోసం నేరాలు చేసే వారు ఉన్నారని మండిపడ్డారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడాలి. నేరాల తీరు మారుతోంది. క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారు. వారి ఆట కట్టించాలంటే పోలీసు శాఖ కూడా అప్డేట్ అయి ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు.
సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేకవుట్ ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతీ 50 మీటర్లకి ఒక సీసీ కెమేరా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పని చేస్తుందన్నారు. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్‌గా పట్టుకునే వీలు కలుగుతుందన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ, అధునాతన పోలీస్ స్టేషన్లు, ఈగల్ , శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు.






