మాజీ సీఎం కేసీఆర్ కు యాదవులంటే ప్రేమ
హైదరాబాద్ : దున్నలకు పూజలు నిర్వహించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. గత ఏడాది సదర్ పండుగకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని , ఈసారి కూడా మొండి చెయ్యి చూపించిందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కి యాదవులు అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవమో మీ అందరికీ తెలియనిది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదవులు మంత్రులుగా ఉన్నారని, .అంతే కాకుండా నలుగురు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా యాదవ్ ఉన్నారని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు ఉన్న గుర్తింపు ఏంటో మీకే తెలుసు అన్నారు.
యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో కేసీఆర్ ఎంత గొప్పగా చెప్పారో మీరందరూ చూశారని చెప్పారు.ఏ సీఎం కూడా యాదవ జాతి నిజాయితీ గురించి, పనితనం గురించి, నిబద్ధత గురించి శాసనసభలో చెప్పలేదని అన్నారు హరీశ్ రావు. అలా చెప్పిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
సదర్ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. సదర్ పండుగను తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణకు వ్యాపింప చేశారని ప్రశంసలు కురిపించారు. ఇవాళ అన్ని జిల్లాల్లో ఈ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు హరీశ్ రావు. యాదవులు ఆనాడు అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చి నాగరికతకు ఒక కొత్త రూపు తీసుకు వచ్చారని అన్నారు.







