లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో
యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 25 నుంచి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర నాలుగు నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రతి జిల్లాలో తాము 2 రోజుల పాటు ఉంటామని, అక్కడి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తామని పేర్కొన్నారు. వారు చెప్పే సమస్యలను అర్థం చేసుకొని వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలన్న దానిపై దృష్టి పెడతామన్నారు. ప్రజలతో కూలంకషంగా మాట్లాడేందుకు జాగృతికి ఈ కార్యక్రమం వేదికగా మారనుందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ యాదాద్రిని చక్కగా పునర్నిర్మించారని ప్రశంసలు కురిపించారు కల్వకుంట్ల కవిత.
యాదాద్రి ప్రాశ్యస్తాన్ని కాపాడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరారు. తాము వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్ లను చూశామని, అలా కాకుండా తిరుమలలో మాదిరిగా స్వామి వారి హోర్డింగ్ లు చిత్రపటాలు తప్పా వేరేవి ఉండేందుకు వీలు లేదన్నారు. అలా చేసేందుకు ఈవో , సర్కార్ చర్యలు తీసుకోవాలని సూచించారు కవితక్క. మళ్లీ యాదాద్రికి వస్తాం. అప్పుడు ఇక్కడున్న అన్ని సమస్యలపై వివరంగా మాట్లాడతానని చెప్పారు. టీజీఎస్ ఎన్జీఓగా ఏర్పాటై 19 ఏళ్లు అవుతోందన్నారు.
ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాలను కూడా గతంలో తాము మాట్లాడటం జరిగిందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు మాట్లాడామన్నారు.
రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తామన్నారు. ఏపీ లో మూడు, తమిళనాడు లో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేరళలో గల్లీకి ఒక పార్టీ ఉందన్నారు.







