సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అవినీతికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. వాటాల కోసం , వసూళ్ల కోసం మంత్రులు కొట్టుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. ఇదేనా ప్రజా పాలన అని నిలదీశారు. రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ లో జరిగే ఉప ఎన్నికపై దృష్టి పెట్టిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్దికి కాంగ్రెస్ చేస్తున్న అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి వ్యవహారం గురించి, తుపాకీతో దెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరించిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిందని అయినా సీఎంకు బుద్ది రావడం లేదన్నారు. అసలు ఎలాంటి పదవులు లేని సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలకు ఎలా గన్ మెన్లను కేటాయిస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్.
మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ షీటర్ల పాలన కొనసాగుతోందన్నారు. తుపాకీ రోహిన్ రెడ్డి పెట్టిండా, సుమంత్ పెట్టిండా అన్నది తేలాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ఇంత వరకు డీజీపీ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు కేటీఆర్. మంత్రి, సీఎం మధ్య నెలకొన్న విభేదాల కారణంగా మంచి ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇలాంటి వాళ్ల వల్ల తెలంగాణ ఎలా బాగు పడుతుందంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. అలీబాబా దొంగల ముఠాల పాలన తయారైందన్నారు.






