పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. చెరువులను పునరుద్దరించే పనిలో పడింది. ఇందులో భాగంగా పాతబస్తీలోని చారిత్రిక నేపథ్యం కలిగిన బమృక్నుద్దౌలా చెరువు పునరుద్దరణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే,నగిషీలు చెక్కుతున్నారు. నిజాంల కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేస్తున్నారు. చెరువులో కూడా మట్టిలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్ర పరుస్తున్నారు. ఔట్‌లెట్‌కు మళ్లీ గేట్లు బిగిస్తున్నారు. స్థానిక నివాసితులు అక్కడకు వచ్చి సేదదీరే విధంగా రూపొందించడమే కాకుండా సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేస్తున్నారు. చార్ సౌ షహర్ హమారా . 435 ఏళ్లకు పైబడిన చరిత్ర ఈ నగరానిది. అడుగడుగునా చారిత్రక ఆనవాళ్లు, ఎన్నో విశేషాలు దీని సొంతం. 1770లో హైదరాబాదు మూడవ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ఉద్దౌలా నిర్మించిన బమృక్నుద్దౌలా చెరువు. ఈ చెరువుకు సంబంధించిన సమాచారం స్థానికంగా ఉన్న వృద్ధులు పలు విధాలుగా వివరిస్తున్నారు.
చారిత్రక ఆనవాళ్లు ప్రకారం వంద ఎకరాలకు పైగా ఈ చెరువు విస్తరించి ఉండేదని.. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చెబుతున్నారు. నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని తెలిపారు. అలాగే బమృక్నుద్దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు వినియోగించేవారని మరి కొంతమంది వివరిస్తున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించే వారంటున్నారు. అంతే కాదు.. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని.. ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లే వారంటున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబర పడుతున్నారు.






