మార్కెట్ ధరను చెల్లించాలని డిమాండ్
పాలమూరు జిల్లా : జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలమూరు జిల్లాలో పర్యటించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండపూర్ జలాశయంలోని నిర్వాసిత రైతులను కలిశారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 20 శాతం పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భూ నిర్వాసితుల హక్కులను కాపాడాల్సన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి తనంతకు తాను పాలమూరు పులి అని పదే పదే చెప్పుకుంటున్నాడని, కానీ పాలనా పరంగా చూస్తే చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు కవిత. చివరకు ఆయన మంత్రులనే కంట్రోల్ లో పెట్టుకునే స్థితిలో లేడన్నారు. ఆయన పాలమూరు పులి కాదని, కేవలం కాగితాల వరకు మాత్రమే పులి అని తేలి పోయిందన్నారు. ఇది వాస్తవంగా చూస్తే అర్థమై పోతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములు వదులుకున్న రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వారికి ఎకరానికి రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం 2021 కటాఫ్ ప్రకారం కాకుండా చెల్లింపు రోజున రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ చేర్చాలని కోరారు కల్వకుంట్ల కవిత.






