నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
పాలమూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఉద్దండాపూర్, కరివెన గ్రామాస్తులతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 శాతం పనులు పూర్తయ్యాయని, ఇంకా 20 శాతం మాత్రమే పనులు కావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు అడుగు ముందుకు సాగ లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్యం కోసం పోరాటం తోనే సరి పోయిందని, ఇక పాలన ఎలా సాగిస్తారంటూ సీఎంను ప్రశ్నించారు. విమర్శలు, ఆరోపణలు చేయడం, అప్పులు తీసుకు రావడం తప్పా రేవంత్ రెడ్డి చేసింది ఏముందంటూ నిలదీశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లను సుప్రీంకోర్టు సస్పెన్షన్ లో పెట్టిందని, దీని విషయంపై సీఎం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఫైర్ అయ్యారు కవిత రివ్యూ పిటిషన్ కూడా వేయక పోవడం దారుణమన్నారు. సీడ్య్లూసీ ఈ ప్రాజెక్ట్ ల పర్మిషన్లను ఆపేసి ప్రాజెక్ట్ లను లిస్ట్ లోంచి తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రే స్వంత జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కవిత. ఒక పక్క ఉన్న నీళ్లను వాడుకోవటం లేదు. మరో పక్క ఆల్మట్టి ఎత్తు పెంచితే మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు. అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉందని, ఇక్కడ కూడా అదే పార్టీ పవర్ లో ఉంది. కానీ పాలమూరుకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.






