గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్
హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు తనకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు ప్రకటించింది. కాగా ఇంకా అధికారికంగా టీపీసీసీ, ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడ లేదు. ఇప్పటికే తనను ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఏఐసీసీ మాజీ చీఫ్, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక అజారుద్దీన్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు పొందాడు. తనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మణికట్టు మాంత్రికుడిగా పేరు పొందాడు. టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసి అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతే కాదు అద్బుతమైన ఫీల్డర్ గా కూడా గుర్తింపు పొందాడు. ఇదే సమయంలో తను కెప్టెన్ గా ఎందరికో ఛాన్స్ ఇచ్చాడు. ముంబై ఆధిపత్యానికి తెలివిగా చెక్ పెట్టాడు. ఆ తర్వాత అనూహ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తనపై బీసీసీఐ బ్యాన్ విధించింది.
చివరకు దానిని ఎత్తి వేసింది. కోర్టు తనను నిర్దోషిగా తేల్చింది. అనంతరం తను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. యూపీ నుంచి ఎంపీగా గెలుపొందాడు. మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలుపొందాడు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచాడు. ఓటమి పాలయ్యాడు. ఈసారి కూడా తను టికెట్ ఆశించాడు. కానీ వర్కవుట్ కాలేదు. తనకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టాడు. నవీన్ యాదవ్ కు టికెట్ దక్కేల చేశాడు. దీంతో అధిష్టానం అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ కోటా కింద కేటాయించింది. మైనార్టీలకు కేబినెట్ లో చోటు దక్కక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ కారణంగా అజ్జూ భాయ్ కి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చింది ఏఐసీసీ. మొత్తంగా తన చిరకాల కోరిక నెరవేరనుంది. ఆయన గురువారం మినిష్టర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.








