జీసస్ కు రుణపడి ఉన్నా
ముంబై : ముంబై బీవై పాటిల్ వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ టీమ్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత మహిళా జట్టు 5 వికెట్లు కోల్పోయి 339 రన్స్ చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఎవరూ ఊహించని రీతిలో భారత అమ్మాయిలు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. టీమిండియా స్కిప్పర్ హర్మన్ ప్రీత్ కౌర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. మరో వైపు జెమీమా రోడ్రిగ్స్ చుక్కలు చూపించింది.
తను అజేయ సెంచరీతో ఇండియాను విజయ తీరాలకు చేర్చింది. కౌర్ 88 బంతులు ఎదుర్కొని 89 రన్స్ చేస్తే జెమీమా 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 రన్స్ చేసింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఏడుసార్లు ఛాంపియన్ గా ఉన్న ఆసిస్ ను మట్టి కరిపించింది. మ్యాచ్ అనంతరం జట్టు విజయంలో ముఖ్య భూమికను పోషించిన భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ మీడియాతో మాట్లాడారు. తను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ టోర్నీ అంతా నేను ప్రతిరోజూ ఏడుస్తూనే ఉన్నాను. నా మానసిక స్థితి బాగోలేదు. చాలా ఆందోళనను ఎదుర్కొంటూ వచ్చా. తర్వాత జట్టు నుంచి తొలగించబడ్డాను. కానీ చివరి నిమిషంలో నేనేమిటో నిరూపించుకున్నానని కన్నీటి పర్యంతమైంది జెమీమా.








