మహిళా క్రికెటర్లు అదుర్స్..ఛాంపియన్ కు షాక్
ముంబై : కళ్ల ముందున్న భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు భారత మహిళా క్రికెటర్లు. ఇండియాలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కీలక మ్యాచ్ లో సత్తా చాటారు. తమకు ఎదురే లేదని చాటారు. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనున్నారు. ఇందు కోసం అన్ని శక్తులు సిద్దం చేసుకున్నారు. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదికగా సెమీస్ మ్యాచ్ జరిగింది. ఏడుసార్లు ఛాంపియన్ అయిన బలమైన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 49.5 ఓవర్లలో ఏకంగా 338 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వన్డే వరల్డ్ కప్ లో ఇదే అత్యధిక స్కోర్. ఇక అందరూ ఇండియా ఓడి పోతుందని భావించారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఎక్కడా తల వంచ లేదు. ఓ వైపు వికెట్లు రాలి పోతున్నా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ఆడారు అమ్మయిలు.
జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. తను 88 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 2 భారీ సిక్స్ లతో 89 రన్స్ చేసింది. ఇక జెమీమా రోడ్రిగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను మ్యాచ్ చివరి దాకా నిలిచింది. అజేయ సెంచరీతో కదం తొక్కింది. కేవలం 134 బంతులు ఎదుర్కొన్న జెమీమా 14 ఫోర్లతో 127 రన్స్ చేసింది. దీంతో భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలోనే ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే జయకేతనం ఎగుర వేసింది. 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు దర్జాగా దూసుకు వెళ్లింది. యావత్ భారత దేశం జెమీమాకు సలాం చేస్తోంది.








