హైడ్రా కమిషనర్ కు విద్యార్థినుల మొర
హైదరాబాద్ : రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది హైదరాబాద్ లో. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ , ప్రైవేట్ స్థలాలను కాపాడాలని కోరుతూ హైడ్రా ప్రజావాణిలో సమర్పించడం మామూలే. కానీ ఇప్పుడు విద్యార్థినులు సైతం హైడ్రాను ఆశ్రయించారు. ఈ సంఘటన శంషాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్‌లు వరద నీటిలో మునుగు తున్నాయని, దీని కారణంగా తాము పాఠశాలకు వర్షాకాలంలో వెళ్లలేక పోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారంతా కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సులో తాము స్కూల్‌కు వెళ్తామని ,ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్‌పాస్ కింద నీటిలో ఆగి పోవడంతో ఇబ్బంది పడ్డామని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు కమిషనర్ ఏవీ రంగనాథ్. ఇక్కడ అండర్ పాస్‌లన్నింటి పరిస్థితి ఇలాగే ఉంటుందని.. వర్షం పడితే ఇబ్బందిగా పరిణమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత విద్యార్థులు. ఇక్కడ వరద కాలువల్లో పూడికను తొలగించి, సరైన విధంగా నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. వెంటనే ఈ పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. అంతకు ముందు ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హరిహరపురం కాలనీలో ఉన్న కాప్రాయి చెరువుకు ఔట్‌లెట్‌లు లేక ఎగువున ఉన్న తమ కాలనీలు నీట మునుగు తున్నాయని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇన్‌లెట్ ద్వారా ఎంత మొత్తంలో వరద వస్తుందో అంతే మొత్తం కిందకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.






