త్వరలోనే కూకట్ పల్లికి మణిహారం కానుంది
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి నల్ల చెరువు అభివృద్ది పనులను పరిశీలించారు. గతంలో దీనిని కొందరు ఆక్రమించారు. మరికొందరు కబ్జాకు పాల్పడ్డారు. దీనిపై దృష్టి సారించారు కమిషనర్. ఈ మేరకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్బంగా మరింత అందంగా తీర్చి దిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం కూకట్‌పల్లి నల్ల చెరువు ఆరు నెలల్లో ఆహ్లాదంగా మారింది. చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా మారింది. అక్కడ నివాసం ఉన్న వాళ్లే అచ్చెరవొందేలా కూకట్‌పల్లి నల్ల చెరువు తయారయ్యింది. బోటు షికారుకు చిరునామా అయ్యింది. చెరువు అభివృద్ధిపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది. ఉదయం సాయంత్రం వందలాది మంది ఇక్కడకు చేరుకుని సేదదీ రుతున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలతో 16 ఎకరాలుగా మిగిలి పోయింది. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో 30 ఎకరాలకు ఈ చెరువును హైడ్రా విస్తరించింది. చెరువులోకి జరిగి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడంతో 4 మీటర్ల లోతు పెరిగింది. అప్పుడు కాని దుర్గంధం దూరమవ్వలేదు. కేవలం 6 నెలల్లో 30 ఎకరాల మేర చెరువు తయారయ్యిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మురుగు నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెరువు చెంతనే బతుకమ్మ ఆటలకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మలను గంగలో కలపడానికి ప్రత్యేకంగా చిన్న కుంటను అందుబాటులోకి తెస్తున్నారు.






