ప్రకటించిన పారిశ్రామికవేత్త గోవింద్ ధోలాకియా
ముంబై : రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త గోవింద్ థోలాకియా సంచలన ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత 143 కోట్ల భారతీయుల కలను నిజం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ముంబై వేదికగా బీవై పాటిల్ స్టేడియంలో జరిగిన కీలకమైన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో బలమైన దక్షిణాఫ్రికాను 5 వికెట్ల తేడాతో ఓడించింది హర్మన్ ప్రీత్ కౌర్ సేన. ఈ సందర్బంగా భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించారు. తమ సంస్థ నుంచి ప్రతి ఒక్క క్రికెటర్ కు వజ్రాలతో కూడిన ఆభరణాలు ఇస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇందుకు బీసీసీఐ కూడా ఓకే చెప్పింది.
తాజాగా ఆయన చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మరో వైపు బీసీసీఐ కూడా ఎవరూ ఊహించని ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇందులో భాగంగా భారత మహిళా జట్టుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఐసీసీ చైర్మన్ జే షా చేసిన సూచన మేరకు బీసీసీఐ చీఫ్ , కార్యవర్గం ఏకంగా రూ. 51 కోట్ల బహుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు రాజీవ్ శుక్లా. ఇదిలా ఉండగా గోవింద్ ధోలాకియాతో పాటు భారత దేశానికి చెందిన కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ఉమెన్ ఇన్ బ్లూ టీంకు నజరానాలు ప్రకటించేందుకు పోటీ పడుతున్నారు.








