టీమిండియా జట్టుకు ముర్ము కంగ్రాట్స్
న్యూఢిల్లీ : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ విజేత అయిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా రాజధానిలోని రాజ్ భవన్ లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకు వచ్చిన వరల్డ్ కప్ ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత అమ్మాయిలు కలిసికట్టుగా ఆడి దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. మీరు సాధించిన ఈ అపురూపమైన విజయం కోట్లాది మంది మహిళలకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు ముర్ము. అంతకు ముందు జట్టు సభ్యులతో కలిసి ఫోటో దిగారు. అనంతరం ఆతిథ్యాన్ని ఇచ్చారు జట్టు సభ్యులకు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ద్రౌపది ముర్ము.
ఈ విజయంతో ఇండియా మరోసారి ప్రపంచంలో సత్తా చాటిందన్నారు. సమున్నత భారతావని మీకు జేజేలు పలుకుతోందన్నారు. ఇదిలా ఉండగా అంతకు ముందు భారత మహిళా జట్టు, మేనేజ్ మెంట్, బీసీసీఐ కార్యవర్గం దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలిసింది. ఆయన ఆతిథ్యం ఇవ్వడమే కాదు జట్టు సభ్యులతో ఏకంగా 2 గంటలకు పైగా సంభాషించారు. వారిని పేరు పేరునా ఆప్యాయంగా పలకరించారు. మిమ్మల్ని చూస్తే తనకు మరింత ఆనందం కలుగుతోందన్నారు. టోర్నమెంట్ లీగ్ దశలో మూడు మ్యాచ్ లలో ఓడి పోయినా ఆ తర్వాత పుంజుకుని విశ్వ విజేతగా నిలవడం మామూలు విషయం కాదన్నారు మోదీ.








