మోసం చేసిందంటూ మండిపాటు
హైదరాబాద్ : అన్నం పెట్టే అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మరోసారి మోసం చేస్తారని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయొద్దంటూ కోరారు. కనీస మద్దతు ధర కల్పించడం లేదని, పంటలు నష్ట పోయినా ఇప్పటి వరకు నష్ట పరిహారం ప్రకటించ లేదని, కనీసం పరామర్శించేందుకు ఒక్క నేత కానీ , ఎమ్మెల్యేలు, మంత్రులు రాలేదని వాపోయారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమను మరిచి పోయారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్టు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రైతన్నలు. ఇప్పటికే మోస పోయామని, తప్పు తెలుసుకున్నామని , ప్రస్తుతం అరిగోస పడుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన రైతులు బోరబండ డివిజన్లో ప్రచారం చేశారు. తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇంకోసారి గెలిపిస్తే పూర్తిగా నాశనం చేస్తారంటూ వాపోయారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ తాము రైతులమని, నిరసన తెలిపే హక్కు తమకు ఉందన్నారు.






