హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే సహించం
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడినా లేదా భయాందోళనకు గురి చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ సుద్ధకుంటను పరిశీలించారు. ఇళ్లపై వేసిన మార్కింగ్ లను కమిషనర్ చూశారు. అక్రమంగా ఇళ్లపై మార్కింగ్ వేసి భయభ్రాంతులకు గురి చేసిన హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తామన్నారు. చెరువు చెంత ఉన్న నివాసాల వారికి ఎలాంటి చింత అవసరం లేదని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ చెరువుకు 2014లోనే 3.16 ఎకరాల మేర చెరువుందని హెచ్ ఎం డీ ఏ వాళ్లు ప్రిలిమనరీ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.
దాని ప్రకారమే చెరువు హద్దులు నిర్ణయించి కాపాడతామని హామీ ఇచ్చారు. చెరువు హద్దులు మార్చివేసి వేరొక వైపు చెరువు ఉన్నట్లుగా చూపించి ఇళ్లపై మార్కింగ్ వేసిన అధికారులపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తాయంటూ దాదాపు 48 ఇళ్లపై స్థానిక అధికారులు మార్కింగ్ చేయడాన్ని తప్పుబట్టారు. 30 ఏళ్ల నుంచి నివాసాలు ఉంటున్న వారి జోలికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఇళ్లపై వేసిన మార్కింగులు వెంటనే తొలగించాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు ప్రతిపాదించిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు పక్కన పెట్టి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళతామని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.






