ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేశారని కితాబు
హైదరాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుతమని, ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్బంగా సీఎం ప్రసంగించారు. రామోజీ రావు పేరు కాదని అది ఓ బ్రాండ్ అన్నారు. వాస్తవాలను అందించాలన్న తపన వారిలో కనిపిస్తుందన్నారు. పచ్చళ్లు తింపించినా, పత్రిక చదివించినా అది రామోజీ రావుకే సాధ్యమైందంటూ కొనియాడారు. ప్రతీ రంగంలో రామోజీ రావు తన ముద్ర వేశారని అన్నారు రేవంత్ రెడ్డి.
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు పొందిన వారికి అభినందనలు తెలిపారు.
మనందరం రామోజీ రావు ఆలోచనలని భవిష్యత్ తరాలకి అందించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు సీఎం. రామోజీరావు బ్రాండ్ ను అలాగే కొనసాగించాలని కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు.








