కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో కీలక ఒప్పందం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. మంగళవారం సీఎం సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వ విద్యాలయంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు , CEO పీటర్ స్కాట్ ( Mr. Petor Scott), ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్ లర్ ఘంటా చక్రపాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి. యూనివర్శిటీ ఇప్పటికే పేరు పొందిందని, దీనిని మరింత పటిష్టవంతంగా అభివృద్ది చేసేందుకు కృషి చేయాలని సూచించారు. మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లడమే కాకుండా ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చేలా, మన యూనివర్శిటీలో అభ్యసించేలా చూడాలని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.






