వెల్లడించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. నగరంలో ఎలా అనువుగా ఉంటే అలా కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. డెడ్ ఎండ్ కాలనీ అయితే ఆ మర్గాన్ని కబ్జా చేసేయడం, పాత లే ఔట్‌లలో హద్దులు చెరిపేసి పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను అడ్డంగా రాళ్లు పాతడం చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో.
ఆఖరుకు ఆలయాలకు ఉద్దేశించిన స్థలాలు, పుణ్య స్నానాలు ఆచరించడానికి ఉద్దేశించిన కోనేరును కూడా కబ్జా చేసేస్తున్నారంటూ జగద్గిరిగుట్టలోని శ్రీ గోవిందరాజు స్వామి దేవస్థానం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
కూకట్‌పల్లి ఎల్లమ్మబండ వద్ద ఉన్న ఎల్లమ్మకుంటలోకి ప్రగతినగర్ మురుగంతా వచ్చి చేరుతోందని కాలువ మల్లింపు పనులు త్వరగా జరిగేలా చూడడంతో పాటు.. కుంట ఆక్రమణలను కూడా తొలగించాలని అక్కడి నివాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. శంషాబాద్ విలేజ్, ఆర్ ఆర్ నగర్ అయ్యప్ప కాలనీలోని సర్వే నంబరు 748, 749లో పార్కుతో పాటు.. ప్రజావసరాలకు కేటాయించిన 4794 గజాల స్థలం కబ్జాకు గురైందని అక్కడి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వాపోయారు. ఇలా నగరం నలుమూలల నుంచి ప్రజావాణికి మొత్తం 52 ఫిర్యాదులు అందాయి. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.






