సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇది మంచి పద్దతి కాదన్నారు. శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఫార్ములా వన్ కార్ రేస్ అనేది పూర్తిగా పారదర్శకతతో నిర్వహించడం జరిగిందన్నారు. ఆనాడు కేబినెట్ ఆమోదంతోనే ఇది జరిగిందన్నారు. ఈ పోటీ నిర్వహించడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిందని చెప్పారు. ఇందులో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ముందు పలుమార్లు కేటీఆర్ హాజరయ్యారని చెప్పారు. మరోసారి ఈ కేసును ముందుకు తీసుకు రావడం వెనుక రాజకీయ పరమైన ప్రయోజనం దాగి ఉందని ఆరోపించారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని, ఇందులో లబ్ది పొందేందుకు ప్లాన్ వేశారని అందులో భాగంగానే కేటీఆర్ పై విచారణకు లైన్ క్లియర్ చేశారని మండిపడ్డారు హరీశ్ రావు. సీఎంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని, పాలనా పరంగా తన గ్రాఫ్ పెరగక పోగా తగ్గిందన్నారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు హరీశ్ రావు. రాష్ట్రంలో ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి నొక్కే ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యనికి తూట్లు పొడవటమేనని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ రేస్ నిర్వహించామన్నారు. ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. న్యాయ పరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.





