బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రైతుల పేరుతో పార్టీ పెట్టుకుని వారిని అన్ని విధాలా వేధించిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. మండలంలోని రాంపురం గ్రామంలో రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం నిర్వహించిన వర్క్ షాపులో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారి బాగుకోరుకునే ప్రభుత్వం తమదన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటి మార్చలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, వ్యవసాయాధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ఏయే పంటలు వేయాలి, ఏ పంట వేస్తే అధిక దిగుబడులతో పాటు ధరలు లభిస్తాయి… ఏ ఎరువులు వాడాలి…? అనే అంశాలపై వివరించారన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమ నిర్వహణపై అన్నదాతల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అధికారులు సూచనల మేరకు పంట మార్పిడి చేస్తామని రైతులు చెబుతున్నారన్నారు మంత్రి సవిత. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, పారిశ్రమికాభివృద్ధితో పాటు వ్యవసాయానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా తీర్చి దిద్దుతున్నారన్నారు. వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పెట్టుబడులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.






