మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కామెంట్స్ చేసిన మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లడారు. కాళేశ్వరం కూలిపోవడం, చెల్లించని బిల్లులను ప్రస్తావించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని వ్యాఖ్యానించారు . కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని సాగునీటి శాఖ మంత్రి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కారణమని మండిపడ్డారు. ఆయన హయాంలోనే ప్రాజెక్టు కూలిపోవడానికి లోపభూయిష్టమైన డిజైన్, అమలు కారణమని పేర్కొన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను తీవ్రంగా విమర్శించారు, మేడిగడ్డ ప్రాజెక్టును సమర్థించడం మానేసి, సిగ్గుతో తలదించు కోవాలని అన్నారు. ప్రాజెక్టు భారీ వ్యయం రూ. 1.80 లక్షల కోట్లను ఆయన ప్రస్తావించారు ప్రత్యేకంగా. ఇది చాలా వరకు ఉపయోగంలోకి రాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 70 నుండి 80 టీఎంసీల నీటిని మాత్రమే ఉపయోగించుకుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి ఆరోపించారు. ఈ ఆర్థిక దుర్వినియోగం కారణంగా ఇప్పుడు రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలోని రుణాలపై ఏటా రూ. 16,000 కోట్లు వడ్డీగా చెల్లించవలసి వస్తోందని వాపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరును దత్తత తీసుకున్న కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని అన్నారు.





