ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సోమవారం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిల కోసం రూ. 365.7 కోట్లు విడుదల చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనూ విద్య విషయంలో రాజీ పడదని భట్టి స్పష్టం చేశారు. సంక్షేమ శాఖలలో పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ ఒకేసారి విడుదల చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాం నుండి పెండింగ్‌లో ఉన్న బిల్లు బకాయిలను పూర్తిగా చెల్లించాలని ఆయన నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
విద్య ద్వారా మాత్రమే సమాజంలో సమగ్రమైన, శాశ్వతమైన మార్పును తీసుకు రాగలమని ఆయన నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్ల మొత్తాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా మంజూరు చేసిన బకాయిలలో బీసీ సంక్షేమ శాఖకు రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.152.59 కోట్లు విడుదల చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర అధికారులు పాల్గొన్నారు.





