నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ ఆసరా
అమరావతి : అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పటం గ్రామంలో ఉన్న నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నావంటూ అడిగారు. కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలుకరించారు. సంక్రాంతికి చీర, ఖర్చులకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. తాను ప్రేమతో తీసుకు వచ్చిన చీరను బహూకరించారు. మాటల మధ్యన ఈ రోజుకీ కుటుంబ పోషణ నిమిత్తం పొలం పనులకు వెళ్తున్నట్టు నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ తో గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి నెలా తన జీతం నుంచి పిఠాపురంలో అనాథ చిన్నారులకు ఇచ్చిన విధంగా రూ. 5 వేలు పోషణ నిమిత్తం ఇంటికి పంపనున్నట్టు తెలిపారు.
దివ్యాంగుడైన నాగేశ్వరమ్మ మనుమడు మనోజ్ సాయి చదువుల నిమిత్తం రూ. లక్ష సాయం చేశారు. ఆమె కుమారుడు కొండయ్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు ఇచ్చారు. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటం వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. కొలనుకొండ, ఇప్పటం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నిలబడి హారతులు పడుతూ, పూల వర్షం కురిపించారు. ఇప్పటం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రజలతో మమేకం అయ్యారు.






