బయటకు వస్తే తన్నాలని ఉందంటూ కామెంట్
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. బుద్ది ఉన్న ఏ సీఎం ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడరన్నారు. సోయి లేకుండా రోజు రోజుకు దిగజారి పోయి కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సెక్యూరిటీ మధ్యన ఉన్నాడని సేవ్ అయ్యాడని, కానీ బయటకు రక్షణ లేకుండా వస్తే సీన్ వేరేగా ఉంటుందన్నారు కేటీఆర్.
సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా వాడుతున్న అసభ్యకర భాష, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఏనాడూ తన తండ్రి నిన్ను వ్యక్తిగతంగా విమర్శించ లేదన్నారు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. దానిని జీర్ణించు కోలేని నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకుంటామని అనుకోవడం భ్రమ అని అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి పదజాలాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నీకు సత్తా ఉంటే గతంలో ప్రకటించిన హామీలన్నీ అమలు చేయాలని సవాల్ విసిరారు.






