సీఎం నారా చంద్రబాబు నాయుడు
తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా సూపర్ పవర్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తిరుపతిలో శుక్రవారం భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు… మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని కొనియాడారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. పవిత్ర ప్రాంతమైన తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు సీఎం. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు.
2 వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేది. నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదని చెప్పారు సీఎం. కానీ విదేశీ పాలన, స్వాతంత్ర్యం వచ్చాక మనం చేసుకున్న కొన్ని పాలసీల వల్ల దేశం ఇబ్బంది పడిందన్నారు . 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, ఐటీ రెవల్యూషన్ అంది పుచుకున్నాం అన్నారు. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు సీఎం. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందని ప్రకటంచారు. ప్రతి జంట ముగ్గురు పిల్లలు కనాలని మోహన్ భగవత్ చెబుతున్నారు… నేనూ అదే చెబుతున్నా. ఇప్పుడు మన జనాభానే ఆస్తిగా మారారు. కొన్ని దేశాలు వయోభారం సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మనకు ఆ ఇబ్బంది లేదు. తిరుగులేని యువశక్తితో కూడిన దేశం మనది. ఈ సంపదే మన దేశాన్ని అగ్ర భాగంలో నిలుపుతుంది.






