అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ : పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత కూడా పతంగుల పండగను నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోహైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువులను సందర్శించి పలు సూచనలు చేశారు. చెరువులలోకి నేరుగా మురుగు నీరు చేరకుండా ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు)ల ద్వారా శుద్ధి జలాలు వచ్చేలా ఏర్పాటు వెంటనే చేపట్టాలని సూచించారు. ఎస్ టీపీలను ఏర్పాటుచేసిన ప్రాంతంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు.
ఇందుకు చెరువు చెంత ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించు కోవాలన్నారు. పార్కుల అభివృద్ధితో పాటు.. గ్రీనరీని పెంచాలని సూచించారు. ప్రతి చెరువును ఒక పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలన్నారు. వయసు మల్లిన వారు సేదదీరే విధంగా కూర్చునే వెసులుబాటుతో పాటు.. నీడ కల్పించాలని.. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలను అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. పతంగుల పండుగ ఆహ్లాదకర వాతావరణంలో జరిగేందుకు జీహెచ్ ఎంసీ, పర్యాటకంతో పాటు.. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు కమిషనర్. తాగు నీటి వసతితో పాటు.. మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే చెరువులను సందర్శించేందుకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు పడకుండా సులభంగా వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్న పార్కింగ్ సౌకర్యాన్ని కమిషనర్ పరిశీలించారు.






