కీలక సూచనలు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల : ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ద్వార దర్శనాల కోసం తొలిసారి టీటీడీ ఆధ్వర్యంలో టోకెన్లను జారీ చేయడం జరిగిందని చెప్పారు. తమకు నిర్దేశించిన రోజు, సమయానికి చేరుకోవాలని సూచించారు. ఏ ఒక్క భక్తుడికీ ఇబ్బంది లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ మేరకు మూడు ప్రవేశ మార్గాలను కూడా సిద్ధం చేశామన్నారు.
కేటాయించిన సమయానికి వచ్చే భక్తులకు క్యూలైన్‌కు దగ్గరగా ఉన్న ప్రవేశ మార్గం ద్వారా లోపలికి పంపుతామని వెల్లడించారు. సమయాని కంటే ముందుగా వచ్చే వారిని మరో రెండు ప్రవేశ మార్గాల ద్వారా క్యూలైన్‌లోకి తీసుకుని వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏకాదశికి ముందు 29వ తేదీన మాత్రం పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేసి, వారికి అదేరోజు దర్శనాలు ముగిసేలా చూస్తామని సింఘాల్ అన్నారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కలిపి 7,70,000 మందికి 10 రోజుల్లో శ్రీవారి దర్శనం కల్పించనున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించామని తెలిపారు. మిగిలిన సమయం మాత్రమే వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించినట్లు వెల్లడించారు.







