పంపిణీకి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు
అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సరం సందర్బంగా రైతులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసందర్బంగా సమీక్ష నిర్వహించారు సీఎం. ఆరుగాలం కష్టపడే రైతులకు కూటమి సర్కార్ అందిస్తున్న అపురూపమైన కానుక ఇది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ రెడ్డి ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో… రీ సర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభించామన్నారు. శుక్రవారం నాటితో ప్రారంభమైన పంపిణీ కార్యక్రమం ఈనెల 8వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలు పంపిణీపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందన్నారు సీఎం.






