ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములుపై
కర్ణాటక : బళ్లారి లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. వాల్మీకికి సంబంధించి బ్యానర్ల ఏర్పాటు పై గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చివరకు కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం బళ్లారిలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే బీజేపీకి చెందిన గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి బి. శ్రీరాములుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. బళ్లారి ఘటన వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని మండిపడ్డారు. హైకోర్టుకు చెందిన న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలని రాజకీయ పరంగా డ్యామేజ్ చేసేందుకు ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రకు తెర లేపిందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రితో పాటు సీనియర్లకు భద్రత కల్పించాలని కోరారు.






