రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత
శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. జగన్ అయిదేళ్ల అసమర్థ, ప్రచార యావ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని మంత్రి సవిత మండిపడ్డారు. పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వే రాళ్లపైనా తన బొమ్మలు, ప్రభుత్వ కార్యాలయాలపైనా వైసీపీ రంగులు వేసుకుని ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసిన ఘనుడు జగన్ అని అన్నారు. జగన్, ఆయన పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్నారు. జగన్ అంటేనే కుంభకోణాలని విమర్శించారు. ఇష్టారాజ్యంగా రీ సర్వేలు చేయడం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక పోతున్నాడన్నారు.
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, ఆయన, వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, జగన్ బెదిరింపుకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. అంతకు ముందు నూతన పాస్ బుక్ ల పంపిణీ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్నదే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన, రీ సర్వే తప్పుల తడకగా సాగడం వల్ల భూ సమస్యలపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ల పేరుతో భూ సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నామన్నారు.






