సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియస్
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చిన నాయకుడిగా పేరు పొందిన తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఆరోపణలు, విమర్శలు సహజమేనని కానీ వ్యక్తిగతంగా మరింత దిగజారి మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదన్నారు.
ప్రత్యేకించి బాంబే దుర్ఘటనకు కారకుడైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది కసబ్ ను కేసీఆర్ తో పోల్చడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిపై ఇలాంటి నీచమైన, బాధ్యతారహిత వ్యాఖ్యలు విన్నప్పుడు నా రక్తం మరిగి పోతుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రికి తగనివి అని అన్నారు. ఆమె తెలంగాణ శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంపై.
పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పగలరని, ఎందుకంటే ఆ విషయంపై ఆయనకు అపారమైన జ్ఞానం ఉందని అన్నారు. ఇలాంటి విషయాలను బాధ్యతా రహితమైన ‘బుడగలు పేల్చేవారికి’ అప్పగించకూడదని కవిత స్పష్టం చేశారు.






