8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం పోటెత్తారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి, సుమారు 41,347 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 30,000 మందికి పైగా భక్తులు బటగంగమ్మ ఆలయం వరకు విస్తరించిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేచి ఉండే సమయం సుమారు 20 నుండి 24 గంటల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సంద్బంగా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడారు.
శుక్రవారం నుండి జనవరి 8 వరకు అన్ని దర్శనాలను సర్వ దర్శనం కోసం పూర్తిగా కేటాయించినట్లు తెలిపారు. ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి క్యూలైన్లను , వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అన్ని ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. అన్న ప్రసాదం, తాగునీరు, పాలు వంటి నిరంతర సేవలను శ్రీవారి సేవకుల ద్వారా అన్ని విభాగాలు అందిస్తున్నాయని, దర్శనానికి సంబంధించిన సూచనలను క్రమం తప్పకుండా ప్రకటిస్తున్నారని ఆయన చెప్పారు.







