ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం
విజయవాడ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీపై. కోట్లాది మంది పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసినా మౌనంగా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దేశంలోనే ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసినా, కేంద్రం ‘జీ రామ్ జీ’ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి దానికి గండి కొడుతోందని ఆరోపించారు. ఈ అక్రమ చట్టంతో రాష్ట్రంపై ఏటా రూ.4,500 కోట్ల భారం పడుతుందని, ఈ నిజాన్ని తెలిసి కూడా చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా ఉండడం బాధాకరమన్నారు.
“గోరుచుట్టుపై రోకలి పోటులా ఈ కొత్త చట్టం మారిందన్నారు షర్మిలా రెడ్డి. ఇప్పటికే ప్రతినెలా జీతాలు ఇవ్వడానికే అప్పులు చేసే ప్రభుత్వం, ఈ పథకానికి అవసరమైన 40 శాతం నిధులను ఎక్కడి నుంచి తెస్తుంది అని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగంలో నంబర్ వన్ గా ఉన్న రాష్ట్రంలో ఉపాధికి ఉరి పెడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక మోదీ చేతిలో తోలుబొమ్మనా అని చంద్రబాబును ఉద్దేశించి ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీస్తున్న ‘జీ రామ్ జీ’ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూటమి పార్టీలను వైఎస్ షర్మిలా రెడ్డి కోరారు. పాత నరేగా చట్టాన్ని పునరుద్ధరించేలా బేషరతుగా మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, కూటమి పార్టీల నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎండ గడుతుందని షర్మిల హెచ్చరించారు.






