కార్యాచరణ రూపొందించాలని ఆదేశం
తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సందర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తి భావం మరింత ఉట్టిపడేలా పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే అరికట్టాలని, నార్త్ మాడ, సౌత్ మాడ వీధుల్లో డ్రైనేజీ సక్రమంగా ఉండేలా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ మహా రథంకు సంబంధించి బీహెచ్ ఈఎల్ అధికారులతో సంప్రదించి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. స్వామి వారు విహరించే వాహనాలు, తండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు టిటిడి అనుబంధ ఆలయాలను అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేపట్టేలా సంబంధిత ఆలయాల అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనుబంధ ఆలయాలలో భక్తుల రద్దీకి తగ్గట్లు అవసరమైన పార్కింగ్ , మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, చీఫ్ ఇంజనీర్ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి తదితర అధికారులు పాల్గొన్నారు.







