కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఎలా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ – సీపీఎం కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించు కోలేక భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తన తీరు మార్చు కోవాలని లేక పోతే బాగుండదని అన్నారు. పోలీసులతో కలిసి మధిర నియోజకవర్గంలో అరాచకపు పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు ఉంటుందన్నారు. ఇదేనా మీరు సాగిస్తున్న ప్రజా పాలన అని ప్రశ్నించారు వెస్లీ.
రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రెండు ఏళ్లయినా ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ విషయం గుర్తించి మసులు కోవాలని సూచించారు జాన్ వెస్లీ. అధికారం ఎన్నడూ శాశ్వతం కాదని తెలుసు కోవాలన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయని, రాబోయే రోజుల్లో జరిగే జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో తాము గెలుపొందడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.






