అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రానికి హానీ కలిగించే పని చేయనంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా చర్చకు సమాధానం ఇస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు సీఎం. తెలంగాణ హక్కులకు హాని కలిగించే చిన్న తప్పు కూడా చేయబోమని దేవుడిపై ప్రమాణం చేశారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. నాకు నా ప్రాంతం ముఖ్యం. ఆ తర్వాత పార్టీ. ఆ తర్వాత నాయకుడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని తెలంగాణకు అన్యాయం చేయను అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. మేము అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపిన చరిత్ర మాది అని అన్నారు. ఆ ప్రాజెక్టు పనులు ఆపితేనే చర్చలకు వస్తామని చెప్పామన్నారు.
ప్రాజెక్టు పనులు ఆపారా లేదా అనేది వాస్తవ పరిశీలన కమిటీ ద్వారా విచారణ చేయవచ్చు. నేను చనిపోయినా.. బ్రతికినా.. తెలంగాణ కోసమే. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లుగా తెలంగాణ నీటిని ఆంధ్రకు తాకట్టు పెడతారా? తెలంగాణ హక్కులను ఎవరు ఉల్లంఘించినా నేను నిటారుగా నిలబడి పోరాడుతాను. పాలమూరు కడతామని కంకణం కట్టుకుని బయలు దేరితే విమర్శిస్తారా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టును మొదటి దశలో 45 టీఎంసీలు, రెండో దశలో మరో 45 టీఎంసీలతో పూర్తి చేయాలని ప్రణాళికలు వేస్తున్నాం. మొదటి విడతలో 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాం. కృష్ణా జలాల ట్రిబ్యునల్ నుంచి నీటి కేటాయింపులు సాధించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించడానికి సైనికుల్లా నిరంతరం పని చేస్తున్నాం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.






