డ్రామాలను ఎవరూ పట్టించుకోరని కామెంట్స్
విజయవాడ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జగన్ డ్రామాలు ఆడడంలో దిట్ట అని, అబద్దాలను నిజాలుగా మార్చాలని చేసే ప్రయత్నాలు వర్కవుట్ కావన్నారు. తాను చేసే జిమ్మిక్కులు ఇక్కడ పని చేయవని తెలుసుకుంటే మంచిదన్నారు. డ్రామాల జగన్ రెడ్డి… ప్రాజెక్టుల కోసం మాట్లాడడం సిగ్గు చేటని మంత్రి సవిత విరుచుకు పడ్డారు. అయిదేళ్లలో జగన్ రాయలసీమలో ఎక్కడైనా ఒక్క పిల్ల కాలువ తవ్వారా? అని ప్రశ్నించారు. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కూడా పట్టించు కోలేదన్నారు. అన్నమయ్య డ్యామ్ గేట్ కొట్టుకుపోయి 42 మంది మృతి చెందినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు సవిత.
ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ప్రసక్తే లేదని మంత్రి సవిత తేల్చి చెప్పారు. రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్‌దేన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు 2016-17లో గాలేరు-నగరి కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ నింపి పులివెందుల పైడిపాలెం ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీరందించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడి నుంచి సీబీఆర్ ప్రాజెక్టు ద్వారా కడపకు నీరందించామన్నారు. 40 ఏళ్లలో వైఎస్ కుటుంబం చేయలేని పనిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని మంత్రి సవిత కొనియాడారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కుప్పం వరకూ సాగు నీరందించామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. రాయల సీమకు తాగు, సాగునీరు కల్పించిన ఘనత సీఎందేనని మంత్రి సవిత స్పష్టం చేశారు.






