నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి జిల్లా : వైస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ పాలన గాలికి వదిలి వేసిందని ఆరోపించారు. ప్రధానంగా ఆలయాల నిర్వహణ పక్కదారి పట్టిందన్నారు. కోట్లాది మంది భక్తులు నిరంతరం దర్శించుకునే తిరుమల భద్రత విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ. ఇవాళ గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. ఆలయాల భద్రతపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని ఎంపీ అన్నారు. ఆలయాల పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లనే నిన్న అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గోవిందరాజ స్వామి ఆలయంలోని నడిమి గోపురం ఎక్కాడని ఆరోపించారు.
పవిత్రమైన కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ గురుమూర్తి. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, నకిలీ మద్యం విక్రయాలు జరగడం వల్ల ప్రజలు తాగి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.






