అన్ని రంగాలలో విఫలం అయ్యారని ఫైర్
విశాఖ : ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు ఏపీ సర్కార్ నిర్వాకంపై. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడని, పాలనా పరంగా తనకు పట్టు లేకుండా పోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమం అందించడంలో పూర్తిగా విఫలమైందని శాసన మండలిలో విపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలలో రైతులు, విద్యార్ధులు, మహిళల సహా అన్ని వర్గాల ప్రజలకు మోసం జరిగిందని ఆయన మండిపడ్డారు. రెండేళ్ల బాబు పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోయిందని తేల్చి చెప్పారు. మద్ధతు ధరలతో పాటు రైతులకు కనీసం యూరియా కూడా అందించలేక కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిలువునా మోసం చేసిందన్నారు.
ఒకవైపు రెండేళ్లుగా వితంతు ఫించన్ ఊసే ఎత్తని ప్రభుత్వం… మరోవైపు చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నా స్పందించడం లేదని ఆక్షేపించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జంతుబలి కేసులో నిందితులను నడిరోడ్డుపై నడిపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించిన ఆయన… డీజీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో క్షీణించిన లా అండ్ ఆర్డర్ కు ఇదే నిదర్శనమన్న ఆయన… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిర్దేశించిన సమయంలోగా నిర్మాణ పనులు చేపడుతున్న జీఎంఆర్ సంస్దను అభినందించిన బొత్స… వైయస్.జగన్ హయాలోనే భోగాపురం ఎయిర్ పోర్టుకు వైయస్.జగన్ హాయంలోనే పునాది పడిందని తేల్చి చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం అయినా ప్రజలకు మళ్లీ అలాంటి కష్టాలు రాకూడదని, ఈ ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు బొత్స సత్యనారాయణ. ముఖ్యంగా రైతులు ఎరువుల కొరతతో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రూ.260 ధర ఉన్న యూరియాను రూ.500లకు బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ఒడిశా నుంచి అక్రమంగా యూరియా తెచ్చుకుని శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో రైతులు అవసరాలు తీర్చుకుంటున్నారని వాపోయారు.






