స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంలో యుద్ద ప్రాతిపదికన పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి సీఎం కీలక సూచనలు చేశారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామన్నారు. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామన్నారు చంద్రబాబు నాయుడు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం అన్నారు.
ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపు ఇచ్చారు ముఖ్యమంత్రి. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశామని వెల్లడించారు. స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారని తెలిపారు. దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశాం అన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేశామన్నారు. దీనికి రూ.2684 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించామన్నారు.






