దివ్యాంగులకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగత పాలమూరు జిల్లాకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా దివ్యాంగులకు కీలక సూచనలు చేశారు. సమాజ అభివృద్దిలో మీరు కూడా కీలకమైన భాగస్వాములేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. ట్రాన్స్ జెండర్స్ కు ఖుష్ కబర్ చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని నామినేట్ చేయాలని సూచిస్తున్నానని చెప్పారు.
వారి సమస్యల పరిష్కారం కోసం వాళ్లే గళం విప్పేలా వారికీ రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆయన కోరారు. వయోవృద్ధులు మన ప్రభుత్వ కుటుంబ సభ్యులేనని అన్నారు. వారి సంక్షేమం కోసం “ప్రణామ్” పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం అని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం నేరుగా తల్లిదండ్రులకు అందించేలా చట్టం తీసుకు వస్తామని ప్రకటించారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని చెప్పారు. పుట్టుకతో వికలాంగుడైనప్పటికీ ఎంతో కష్టపడి భారత దేశం గర్వించేలా ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.






