నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లే సీఎం పాలన సాగిస్తున్నాడని ఆరపించారు. ఇది మంచి పద్దతి కాదన్నాడు. బాబు హయాంలోనే తెలంగాణ తీరని అన్యాయానికి గురైందని ఆ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అందుకే ఇక్కడ టీడీపీని అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. ఈ విషయం తెలిసే మెల్లగా తన శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా లోపాయికారీగా పాలన సాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. మంగళవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .
ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తన పనితీరు మార్చుకోవాలని సూచించారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశ పూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు హరీశ్ రావు. ఈ మాత్రం దానికి ఉత్తమ్ కుమార్ సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు గండి పడిందన్నారు. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి పర్మిషన్ ఇవ్వడం తప్ప మరోటి కాదన్నారు హరీశ్ రావు.






